పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక జిడబ్ల్యూఎంసీ, సెప్టెంబర్ 24:
రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ నగర ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.గురువారం జీడబ్ల్యూఎంసీ ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, డీఆర్‌ఎఫ్ తదితర విభాగాల అధికారులతో కమిషనర్ టి. వెంకన్న టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో వర్షాల పరిస్థితి, నీటిముంపు ప్రాంతాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, సిబ్బంది, యంత్రాల అందుబాటు తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చోట తక్షణమే స్పందించాలని కమిషనర్ సూచించారు. విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు జెసిబి లు, డీవాటరింగ్ మోటార్లు, ట్రాక్టర్లు, ఇతర అవసరమైన యంత్రాలు, పరికరాలను సిద్ధంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలకు సిబ్బంది, యంత్రాలను ఆలస్యం లేకుండా తరలించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.చెట్లు విరిగిపడటం, రహదారులపై వరదనీరు నిలవడం, విద్యుత్ సంబంధిత సమస్యలు, నాలాలు పొంగిపొర్లడం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.భారీ వర్షాల కారణంగా ప్రమాద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని కమిషనర్ ఆదేశించారు. పరిస్థితులు తీవ్రతరమైతే ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతాలు, సహాయక/పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, డీఆర్‌ఎఫ్ తదితర విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నగరంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఏ సమస్య గుర్తించినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజల నుంచి వర్షాలు, నీటిముంపు, వరదనీరు, చెట్లు విరిగిపడటం తదితర సమస్యలపై ఫిర్యాదులు, సమాచారాన్ని స్వీకరించేందుకు GWMC ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్‌ఫ్రీ: 1800 425 1980 కంట్రోల్ రూమ్: 9701999645 వాట్సాప్: 9701999676 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని, అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ టి. వెంకన్న కోరారు.ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ జీడబ్ల్యూఎంసీ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బల్దియా అధికారులు రెస్క్యూ, డి ఆర్ ఎఫ్ బృందాలు, సిబ్బంది, యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని కమిషనర్ వెంకన్న తెలిపారు.