పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26
మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న “పోషణ మాసం” కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ వర్ధన్నపేట ప్రాజెక్టు ఆధ్వర్యంలో వర్ధన్నపేట మున్సిపల్ సమావేశం మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల సేవలు, చిన్నారులకు అందుతున్న పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. “మన అంగన్‌వాడీ – మన బాధ్యత” అనే స్ఫూర్తితో ప్రతి అంగన్‌వాడీ కేంద్రం ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు.
చిన్నారుల్లో రక్తహీనతను నివారించడంతో పాటు, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో వేడి వంటకాలు, పోషకాహార పంపిణీ, బాలల సంరక్షణ, ప్రాథమిక విద్య వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు.సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసం సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో పోషకాహారం, ఆరోగ్యం, బాలల అభివృద్ధిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అనంతరం ఈ గర్భిణులకు శ్రీమంతం నిర్వహించి, పసుపు–కుంకుమ, పండ్లు అందజేసి ఆశీర్వదించారు.గర్భధారణ సమయంలో తల్లులు సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే శిశువు ఆరోగ్యకరంగా ఎదుగుతాడని, గర్భిణులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ శిబారాణి రాజేందర్, మార్కెట్ చైర్మెన్ నరకుడు వెంకటయ్య, pacs చైర్మెన్ అబ్బిడి రాజిరెడ్డి, టెంపుల్ చైర్మెన్ ప్రభాకర్ గౌడ్,మండల అధ్యక్షులు వెంకన్న గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ల,సర్పంచులు,ఉపసర్పంచులు,డైరెక్టర్లు,వార్డు మెంబర్లు,మహిళ సోదరీమణులు, ఐసీడిఎస్ అధికారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.