పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ 2వ తాండలో భూ వివాదం నేపథ్యంలో ఐదు కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మాలోత్ బాల్ సింగ్, సేవే రామ్, బావ్య, తారాచంద్, బాలు కుటుంబాలకు చెందిన వ్యవసాయ భూమి వద్ద సుమారు 15 ఏళ్ల క్రితం బోరు, రోడ్డు విషయంలో వివాదం తలెత్తిందని చెబుతున్నారు. ఆ భూమిలో తండావాసులు కమిటీ బోరు ఏర్పాటు చేశారని.. అనంతరం అదే బోరును సాకుగా చూపుతూ తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించడంతో తమపై తండా పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసి కుల బహిష్కరణ చేశారని వాపోతున్నారు. శీతల్, తీజ్ పండుగల సందర్భంగా కూడా తమను గుడి వద్దకు రానివ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ఐదు కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు ఆరోపిస్తున్నారు. తిరిగి కులంలో చేర్చుకోవాలంటే ఒక్కో కుటుంబం లక్ష రూపాయల చొప్పున మొత్తం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని తండా పెద్దలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.భూ వివాదం పేరుతో తమ కుటుంబాలను సామాజికంగా వెలివేయడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఐదు కుటుంబాలు.. అధికారులు వెంటనే చొరవ తీసుకోని విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు