Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 4:13 pm Posted by : parivarthanaawaaz

గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ కోరారు.

కామారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ : భక్తి మన బలం.. భద్రత మన బాధ్యత: కామారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహిద్దాం
• మండపాల భద్రతకు నిర్వాహకులదే కీలక బాధ్యత.. CCTV, రాత్రివేళ నిఘా తప్పనిసరి
• విగ్రహాల రవాణాలో అప్రమత్తత అవసరం.. విద్యుత్ తీగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు
• అగ్ని ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి
• భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు.. వదంతులు, రెచ్చగొట్టే సందేశాలకు దూరంగా ఉండాలి – డీజేలకు అనుమతి లేదు
• పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేద్దాం.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను విజయవంతం చేద్దాం జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కామారెడ్డి కళాభారతీ ప్రాంగణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, శోభాయాత్రలపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ విక్టర్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. నరసింహారెడ్డి , కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్ , ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీ శ్రీనివాస్ రావు , బాన్సువాడ డీఎస్పీ శ్రీ విఠల్ రెడ్డి  మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా వ్యాప్తంగా గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, పట్టణ పెద్దలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవడం కామారెడ్డి జిల్లా ప్రత్యేకత అని, అదే స్ఫూర్తితో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సోదరభావంతో నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సవాలు ప్రజలందరికీ ఆనందాన్ని పంచేలా ఉండాలని, భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గత సంవత్సరం జరిగిన విషాద ఘటన మరోసారి పునరావృతం కాకూడదు. ఈ సంవత్సరం ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా, ఎవరికీ గాయం కాకుండా గణేష్ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించుకోవాలని సంకల్పిద్దాం” అని జిల్లా ఎస్పీ  పిలుపునిచ్చారు. గతేడాది మాచారెడ్డి మండలంలో విగ్రహాన్ని తరలించే సమయంలో విద్యుత్ తీగలు తగిలి ఒక ప్రాణం కోల్పోగా, కామారెడ్డి ఇంద్రానగర్‌లో విగ్రహ తరలింపు సమయంలో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. ఒక ప్రాణం కోల్పోవడం ఆ కుటుంబానికి జీవితాంతం తీరని లోటని, అలాంటి విషాదం మరే కుటుంబానికీ కలగకూడదని అన్నారు గణేష్ విగ్రహాల ఏర్పాటు నుంచి మండపాల నిర్వహణ, విగ్రహాల రవాణా, భక్తుల రద్దీ నియంత్రణ, నిమజ్జనం వరకు ప్రతి దశలోనూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పోలీస్ శాఖతో పాటు ఉత్సవ నిర్వాహకులు, యువత, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ, మున్సిపల్ అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గణేష్ మండపాలను ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. విగ్రహం పరిమాణం, ఏర్పాటు చేసే ప్రదేశానికి అనుగుణంగా స్టేజ్‌ను ఏర్పాటు చేసుకోవాలని, అవసరానికి మించి పెద్ద స్టేజ్‌లు ఏర్పాటు చేసి రహదారులు లేదా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించకూడదని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు ఏర్పాటు చేసి, భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకునేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
విగ్రహాల భద్రతతో పాటు దొంగతనాలను నివారించేందుకు మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి సమయంలో కూడా నిర్వాహకులు లేదా సంబంధిత వ్యక్తులు మండపం వద్ద కాపలాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ  సూచించారు. ప్రతి మండపం వద్ద పోలీస్ పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, పోలీస్ సిబ్బంది మండపాన్ని సందర్శించినప్పుడు వారి సూచనలు, తనిఖీ వివరాలు మరియు అవసరమైన సమాచారాన్ని అందులో నమోదు చేసుకోవాలని తెలిపారు. గణేష్ విగ్రహాలను మండపాలకు తరలించే సమయంలో నిర్వాహకులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ  సూచించారు. విగ్రహం ఎత్తు, వాహనం ఎత్తు, రహదారిపై ఉన్న విద్యుత్ తీగల పరిస్థితిని ముందుగానే పరిశీలించుకోవాలని తెలిపారు. విద్యుత్ తీగలకు విగ్రహాలు తగలకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే విగ్రహాలను తరలించాలని సూచించారు. విగ్రహం పరిమాణం, ఎత్తుకు అనుగుణమైన వాహనాన్ని మాత్రమే వినియోగించాలని, రవాణా సమయంలో ప్రజలకు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వేగం కంటే భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండపాల్లో విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులు, సౌండ్ సిస్టమ్‌లు మరియు ఇతర విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఏర్పాటు చేయాలని, తడిగా ఉన్న ప్రదేశాల్లో విద్యుత్ పరికరాలను ఉపయోగించకూడదని సూచించారు. విద్యుత్ ఏర్పాట్లను నిపుణులచే చేయించుకోవాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.మండపాల వద్ద దీపాలు, ప్రమిదలు, కొవ్వొత్తులు తదితర వాటిని ఏర్పాటు చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ  సూచించారు. మండపానికి సమీపంలో మండే వస్తువులు లేకుండా చూడాలని, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. అవసరమైన చోట ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫైర్ బాల్స్ లేదా నీటి బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గాలికి పరదాలు ఎగిరి దీపాలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు, వ్యర్థాలను వేయడానికి డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా ఎస్పీ సూచించారు. మండపాల వద్దకు వచ్చే చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు, నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రద్దీ సమయంలో పిల్లలు తప్పిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. గణేష్ ఉత్సవాలను సాదాసీదాగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ  సూచించారు. డీజేలు, అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకరమైన కార్యక్రమాలు నిర్వహించడం, ఇతర మతాలను కించపరిచే విధంగా ప్రసంగాలు లేదా పాటలు నిర్వహించడం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని . ఉత్సవాలను సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.సోషల్ మీడియా, వాట్సాప్ తదితర మాధ్యమాల్లో వచ్చే దురుద్దేశపూర్వక, రెచ్చగొట్టే సందేశాలు, వదంతులను నమ్మవద్దని  . అలాంటి సందేశాల ఆధారంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు పాటిస్తూ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలని  కోరారు. నిమజ్జన కార్యక్రమంలో ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ, సోదరభావంతో వ్యవహరించాలని తెలిపారు.
ఉత్సవాల నిర్వహణకు ముందుగానే జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశం నిర్వహించి, భద్రతా చర్యలు మరియు ముందస్తు జాగ్రత్తలపై సంబంధిత వర్గాలకు అవగాహన కల్పించడం జరిగిందని  తెలిపారు. పోలీస్ శాఖ, ఉత్సవ నిర్వాహకులు, యువత, ప్రజలు మరియు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించవచ్చని అన్నారు.
“ఈ సంవత్సరం మన పండుగలో ఆనందమే ఉండాలి.. విషాదానికి చోటు ఉండకూడదు. మనందరం కలిసికట్టుగా పనిచేసి ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దాం. భక్తి మన బలం.. భద్రత మన బాధ్యత. అందరి సహకారంతో సురక్షిత గణేష్ ఉత్సవాలు మన సంకల్పం” అని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  పిలుపునిచ్చారు.