పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంచేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లోని వివిధ శాఖలకు కేటాయించిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను సంబంధిత శాఖలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఊటకుంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కుంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, నీటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి, వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా డబ్ల్యూడీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మొక్కను నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, వాటికి క్రమం తప్పకుండా నీరు అందిస్తూ సంరక్షించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతి శాఖ బాధ్యతగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి, డీఆర్ఓ పాండు, ఏవో మసూద్ హైమద్, శిశు సంక్షేమ అధికారి ప్రసన్న, సీపీఓ మెగ్మా శ్రీధర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారి దామోదర్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.