గడ్డం శ్రీనును విధుల్లోంచి తొలగిస్తూ మియాపూర్ డిప్యూటీ కమిషనర్ ప్రెస్‌నోట్
వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు మియాపూర్ సర్కిల్–48 డిప్యూటీ కమిషనర్ సోమవారం అధికారికంగా ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), శేరిలింగంపల్లి జోన్ (ఎస్‌ఎల్‌పీజెడ్) పరిధిలోని మియాపూర్ సర్కిల్–48లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మడికంటి ప్రవీణ్‌కుమార్ (గడ్డం శ్రీను)పై వసూళ్ల ఆరోపణలు రావడంతో అతడి సేవలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సదరు ఉద్యోగిని విధుల్లోంచి తొలగించాలని ఆదేశిస్తూ లేఖ నంబర్ 789/ఎస్ఈ/ఎస్‌ఎల్‌పీజె/సీఎంసి ద్వారా సంబంధిత అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ శ్రీ సాయిరామ్ సెక్యూరిటీ సర్వీసెస్‌కు ఆగస్టు 24న లేఖ పంపినట్లు అధికారులు తెలిపారు.
అయితే, తొలగింపు ఆదేశాలు జారీ అయినప్పటికీ ఆగస్టు 24 తర్వాత కూడా సదరు ఉద్యోగి విధుల్లో కొనసాగడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలగింపు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఉద్యోగి విధుల్లో కొనసాగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు స్పందించారు.ఈ నేపథ్యంలో మడికంటి ప్రవీణ్‌కుమార్ (గడ్డం శ్రీను)ను విధుల్లోంచి తొలగించినట్లు సోమవారం మియాపూర్ డిప్యూటీ కమిషనర్ అధికారికంగా ప్రెస్‌నోట్ విడుదల చేశారు.