Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 3:38 pm Posted by : NUNELA KARUNKAR

రోడ్డు పనుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి బలి

గౌతమీనగర్‌లో శ్రీనివాసరావు మృతి.. బాధ్యులేవరో తేల్చాలని ‘జనం కోసం’ డిమాండ్

 

చందానగర్ గౌతమీనగర్‌లో రోడ్డు పనుల కోసం తవ్వి వదిలేసిన రహదారులు, రోడ్డుపై పేరుకుపోయిన నిర్మాణ సామగ్రి కారణంగా  వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఫ్రెండ్స్‌ కాలనీకి చెందిన శ్రీనివాసరావు నడుచుకుంటూ వెళ్తుండగా కంకర మిశ్రమంపై జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించి కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

రోడ్డు పనుల్లో జాప్యం, భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. రాజకీయ వివక్షతో కొన్ని రోడ్లకే పనులు చేపట్టి, మిగతా రోడ్లను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

 

రోడ్లను తవ్వి నెలల తరబడి పనులు పూర్తి చేయకపోవడం, నిర్మాణ సామగ్రిని రోడ్డుపై వదిలేయడంపై అధికారులను ఆయన ప్రశ్నించారు. శ్రీనివాసరావు మృతిని సాధారణ ప్రమాదంగా కాకుండా సమగ్రంగా విచారించి, నిర్లక్ష్యానికి కారణమైన అధికారులు, కాంట్రాక్టర్ల బాధ్యతను తేల్చాలని డిమాండ్ చేశారు.

 

“అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయిందా? అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి” అని కసిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు.