బిల్డర్ అరెస్ట్.. కాంట్రాక్టర్ కోసం ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు
శేరిలింగంపల్లి,పరివార్తన అవాజ్,ఆగస్టు 24:
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న జీ+6 భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనలో ప్రధాన నిందితుడైన బిల్డర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సయ్యద్ సజీద్ అలియాస్ సయ్యద్ సాజిద్ (39)ను ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్ ఖాజా మొయినుద్దీన్ అలియాస్ మహ్మద్ ఖాజా మియా కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
అంజయ్య నగర్‌లోని సర్వే నంబర్ 135, ప్లాట్ నంబర్ 113/131/1లో నిర్మాణంలో ఉన్న జీ+6 భవనం ఇటీవల ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో భవనంలో టైల్స్ పనులు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేష్ కారే (45), మొహ్‌పాల్ భలావి (46) శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. భవనం కూలిన ప్రభావంతో సమీపంలోని కొండాపూర్ వైట్‌ఫీల్డ్స్‌లోని జయదర్శిని రెసిడెన్సీ సీ-బ్లాక్‌కు కూడా నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో కే.వీ. రమణారెడ్డి (75)తో పాటు మరికొందరు గాయపడ్డారు.
*అనుమతులు లేకుండానే నిర్మాణం*
జయదర్శిని రెసిడెన్సీకి చెందిన తక్కల వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు క్రైమ్ నంబర్ 945/2026 కింద బీఎన్‌ఎస్ 105 ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ టి. భూపతి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భవనాన్ని బిల్డర్ సయ్యద్ సజీద్, కాంట్రాక్టర్ ఖాజా మొయినుద్దీన్ ద్వారా నిర్మిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అవసరమైన మున్సిపల్ అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టడంతో పాటు, నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లు పాటించలేదని పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న నాలాను ఆక్రమించడం, నాసిరకం నిర్మాణ సామగ్రి వినియోగం వంటి ఆరోపణలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
భవనం కూలిన అనంతరం పోలీసుల దర్యాప్తు వేగవంతం కావడంతో సయ్యద్ సజీద్ దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు గుర్తించి శంషాబాద్ వద్ద అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఖాజా మొయినుద్దీన్ పరారీలో ఉండగా, అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
*కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత*.