Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 4:23 pm Posted by : GIRIBABU NUNELA

చందానగర్ పీఎస్‌లో ఏసీబీ పంజా

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్‌ఐ, కానిస్టేబుల్

చందానగర్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం దాడి నిర్వహించారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రూ.75 వేల లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐ బందేల బలరాజ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

చందానగర్ పీఎస్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 696/2026 కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఎస్‌ఐ రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు . బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు పట్టుకుని, ఎస్‌ఐ టేబుల్ డ్రాయర్‌లో ఉన్న రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఎస్‌ఐ ఇప్పటికే రూ.20 వేలు తీసుకున్నట్లు, స్టేషన్ రైటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ బొట్ట రాఘవేంద్ర కుమార్ (పీ.సీ.-7491) యూపీఐ ద్వారా రూ.10 వేలు స్వీకరించినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ 1064, వాట్సాప్ 9440446106 ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.