Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 7:37 am Posted by : GIRIBABU NUNELA

గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో బిగ్ యాక్షన్.. టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్

బిల్డర్లపై క్రిమినల్ కేసులకు ఆదేశాలు..

అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక తనిఖీలకు కమిషనర్ ఆదేశం

గచ్చిబౌలి: అంజయ్యనగర్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. నిర్మాణానికి సంబంధించి ముందుగానే నోటీసులు జారీ చేసినప్పటికీ, భవన నిర్మాణాన్ని నిలిపివేయడంలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ యు. సంతోష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. అదే సమయంలో అక్రమ నిర్మాణానికి బాధ్యులైన భవన యజమానులు, భాగస్వాములపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

ముందే నోటీసులు ఇచ్చినా.. ఆగని నిర్మాణం

అధికారుల వివరాల ప్రకారం, అంజయ్యనగర్‌లోని సదరు భవనాన్ని ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా గ్రౌండ్ ప్లస్ ఆరు అంతస్తులతో పాటు పెంట్‌హౌస్ నిర్మాణాన్ని చేపట్టినట్లు గుర్తించారు. నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా సెట్‌బ్యాక్‌లు కూడా పాటించలేదని టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు.

ఈ అక్రమ నిర్మాణంపై ఈ ఏడాది జూన్ 17న టౌన్ ప్లానింగ్ విభాగం నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయడంలో సంబంధిత అధికారి విఫలమైనట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇద్దరి మృతితో కఠిన చర్యలు

నిర్మాణంలో భాగంగా భవనం కూలిపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, సమీపంలోని భవనానికి నష్టం వాటిల్లడం తీవ్రంగా పరిగణించిన సీఎంసీ కమిషనర్ జి. సృజన ఐఏఎస్.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ యు. సంతోష్ కుమార్‌ను  సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  భవన నిర్మాణంపై ముందుగానే అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ, ప్రమాదాన్ని నివారించే స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం అధికారుల వైఫల్యంగా పరిగణించినట్లు తెలుస్తోంది. సంతోష్ కుమార్‌పై తదుపరి క్రమశిక్షణా చర్యలు కూడా చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

యజమానులు, భాగస్వాములపై క్రిమినల్ కేసులు

అక్రమ నిర్మాణానికి బాధ్యులుగా పేర్కొంటున్న భవన యజమానులు ఫరీన్ సిద్ధిఖ్, ఎం.డి. సాజిద్‌తో పాటు వారి భాగస్వాములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులు రాయదుర్గం పోలీసులను కోరారు. నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్

గచ్చిబౌలి ఘటన నేపథ్యంలో సీఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు, సెట్‌బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలు, ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ కొనసాగుతున్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన చోట కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

నోటీసులకే పరిమితం కాకుండా చర్యలు ఉంటాయా?

గచ్చిబౌలి ఘటన తర్వాత అధికారులపై చర్యలు తీసుకోవడం, బిల్డర్లపై క్రిమినల్ కేసులకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్మాణాలు ప్రారంభమైన సమయంలోనే వాటిని అడ్డుకుంటే ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై కేవలం నోటీసులు జారీ చేయడం కాకుండా, వాటి అమలు, నిర్మాణాల పూర్తిస్థాయి పర్యవేక్షణపై అధికారులు ఎంతవరకు దృష్టి పెడతారనేది కీలకంగా మారింది.