Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 12:35 pm Posted by : laxman RAO

39వ డివిజన్ కార్పొరేటర్ బరిలో ఎస్‌కే యాకుబ్ పాషా

డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్నకు బయోడేటా అందజేత

కొత్తగూడెం, పరివర్తన అవాజ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 39వ డివిజన్ కార్పొరేటర్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఎస్‌కే యాకుబ్ పాషా బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన తన బయోడేటాను డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు అందజేశారు.

అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్‌లను మర్యాదపూర్వకంగా కలిసి, 39వ డివిజన్‌కు సంబంధించి తన ఆవేదనను తెలియజేశారు.

ఈ సందర్భంగా యాకుబ్ పాషా మాట్లాడుతూ,
39వ డివిజన్‌లో సుమారు 70 శాతం మైనార్టీ జనాభా ఉన్నందున ఈ డివిజన్‌ను మైనార్టీలకు కేటాయిస్తే గెలుపు నల్లేరు మీద నడకలా సులభమవుతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈసారి అవకాశం కల్పించాలని కోరారు.

గత 10 సంవత్సరాలుగా ఎలాంటి పదవులు ఆశించకుండా, కేవలం కాంగ్రెస్ జెండా మోస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేశామని తెలిపారు. నీతి–నిజాయితీతో రాజకీయాలు చేయడం, నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం తన నైజమని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కష్టపడిన కార్యకర్తలకు ఈసారి అవకాశం ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో, తమలాంటి సాధారణ కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలనే ఆశ కలిగిందని అన్నారు.
మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి టికెట్ ఇవ్వాలని డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్నను, టీపీసీసీ నాయకత్వాన్ని యాకుబ్ పాషా విజ్ఞప్తి చేశారు.