Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 2:54 am Posted by : parivarthanaawaaz

ధర్మవరంలో పర్యావరణ హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్.

ధర్మవరంలో పర్యావరణ హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్.

ఏక్ పెడ్ మా కే నామ్ స్ఫూర్తితో ధర్మవరంలో వృక్షారోపణ చేయనున్న మంత్రి సత్య కుమార్ యాదవ్.

హరిత ధర్మవరం – స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా 10,000 చెట్ల నాటే వృక్షారోపణ కార్యక్రమం

రాబోయే తరాల కోసం నేటి తరమే చెట్లు నాటాలి – మంత్రి ప్రకటన

సత్య సాయి జిల్లా ధర్మవరం( పరివర్తన అవాజ్ ) జనవరి 17, ధర్మవరం పట్టణం ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్‌లో ఆదివారం హరిత ధర్మవరం – స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 చెట్లను నాటే మహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాముల్ని చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమ స్ఫూర్తితో, అదే భావజాలాన్ని ధర్మవరం నియోజకవర్గంలో విస్తృతంగా అమలు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన తల్లి పేరుతో ఒక చెట్టు నాటి, పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా ప్రకృతితో భావోద్వేగ బంధాన్ని పెంపొందించుకోవాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అలాగే, పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామూహిక బాధ్యత అని మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన జీవన విధానం అందించాలంటే నేటి తరమే చెట్లు నాటి ప్రకృతిని సంరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ధర్మవరం నియోజకవర్గాన్ని హరితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ 10,000 చెట్ల నాటే కార్యక్రమంలో పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట, ప్రజా ప్రాంగణాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించామని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రజలతో కలిసి తీసుకుంటామని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు మరియు ధర్మవరం నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హరిత ధర్మవరం – స్వచ్ఛ ధర్మవరం అనే నినాదంతో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం, ధర్మవరం నియోజకవర్గాన్ని పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలిపే దిశగా ఒక కీలక అడుగుగా నిలవనుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిపారు