Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 12:14 pm Posted by : laxman RAO

తెలంగాణ రాష్ట్ర బంజారాల ‘శ్రీశ్రీశ్రీ సాతి భవాని’ మహాజాతర

 

 

తెలంగాణ రాష్ట్ర బంజారాల ‘శ్రీశ్రీశ్రీ సాతి భవాని’ మహాజాతర

– జాతరకు తరలిరానున్న యావత్‌ హిందూ సమాజం

– అన్ని అనుమతులతో జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు

– వారం రోజులపాటు ప్రత్యేక పూజలు, హోమాలు (భోగ్‌ బండారో)

– జాతరకు సహకరిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

– సేవాలాల్‌ మహారాజ్‌ జయంతికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి

విలేకరుల సమావేశంలో బంజారా సంఘాల జేఏసీ వైస్‌ చైర్మన్‌ బానోత్‌ వీరూ నాయక్‌

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

బంజారాల ఆరాధ్య దైవాలు అయిన ‘శ్రీశ్రీశ్రీ సాతి భవాని’ అమ్మవార్ల మహాజాతర ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వారం రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు బంజారా సంఘాల జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌ నాయక్‌ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నట్లు బంజారా సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్‌ చైర్మన్‌ బానోత్‌ వీరూ నాయక్‌ తెలిపారు. ఈ మహాజాతరకు యావత్‌ హిందూ సమాజం తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం విద్యానగర్‌ కాలనీలోని జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌ నాయక్‌ హాస్పిటల్‌ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరూ నాయక్‌ మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల క్రాస్‌రోడ్‌ కొత్తూరు గ్రామ సమీపంలో నిర్వహించతలపెట్టిన ఈ మహాజాతరకు ప్రభుత్వ శాఖల నుండి అనుమతి పొందడం జరిగిందని తెలిపారు. తొలుత ఈనెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన జాతర కొన్ని అనివార్య కారణాల వలన ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా పడిందని వివరించారు. మహాజాతరలో భాగంగా ఈనెల 28వ తేదీ నుండి ప్రత్యేక హోమాలు, శాంతి పూజలు (బోగ్‌ బండారో) జరుపనున్నామని పేర్కొన్నారు. ఈ మహాజాతరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. బంజారాల ఆరాధ్య దైవాలు అయిన మేరేమా జగదంబ భవాని, జ్వాల్ప భవాని, హింగ్లా భవాని, తుల్జా భవాని, కేంకాలి భవాని, ధ్వాలంగళ్‌ భవాని, మత్రాల్‌ భవానిలకు వారం రోజులపాటు ప్రత్యేక పూజలు, భోగ్‌బండారో నిర్వహించడం జరుగుతుందన్నారు. మహాజాతర సందర్భంగా భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా చూసుకుంటామన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులను కలిసి జాతరకు అవసరమైన అనుమతులు కోరుతూ విన్నవించగా, వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కొందరు కావాలని జాతర నిర్వహణపై అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. బంజారా సంఘాల జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘటిత, అసంఘటిత రంగాల నాయకులు, కార్యకర్తలతోపాటు రాజకీయ నాయకుల అండదండలు, సహాయ సహకారాలతో ఈ మహాజాతరను విజయవంతం చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. హిందూ సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకుగాను బంజారాలుగా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నామన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న శ్రీశ్రీశ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్‌ జయంతి నిర్వహణకుగాను ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మహాజాతరకు హిందూ బంధువులు, బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శులు ధరావత్‌ కాన్షిరామ్, గుగులోత్‌ కేశవ్, బానోత్‌ గణేష్‌ మహరాజ్, ట్రెజరర్‌ బానోత్‌ రమేష్, కో–కన్వీనర్‌ బానోత్‌ గోబ్రియానాయక్, బానోత్‌ మోహన్‌ నాయక్, మాళోత్‌ శివ నాయక్, మాళోత్‌ శంకర్, గుగులోత్‌ భద్రునాయక్, బానోత్‌ మంచ్యా నాయక్, లావుడ్య హన్మంతు నాయక్, భూక్య రాము, మహిళా విభాగం కో–కన్వీనర్లు భూక్య రుక్మిణి, భట్టు మంజుల, మాళోత్‌ గంసీ, హాలావత్‌ రుక్మిణి, జాటోత్‌ భరత్, ధరావత్‌ నర్సింహా, సోషల్‌ మీడియా వినోద్‌ నాయక్, వెంకట్‌లు పాల్గొన్నారు.