Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 2:46 pm Posted by : laxman RAO

తరలివచ్చిన అమ్మ… సమ్మక్కకు ఊరంతా స్వాగతం గరీబ్‌పేటలో ఘనంగా సమ్మక్క–సారలక్కల

 

పరివర్తన అవాజ్, కొత్తగూడెం:-తెలంగాణ సంస్కృతి–సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క–సారలక్కల మహాజాతరను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం గరీబ్‌పేట గ్రామంలో గురువారం సమ్మక్క–సారలమ్మల జాతరను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. వనం నుంచి జనంలోకి అమ్మవారి ప్రవేశం సందర్భంగా గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

గరీబ్‌పేటలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలపై సమ్మక్క తల్లి కొలువుదీరగా, ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ రీతుల్లో విశిష్ట పూజలు నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, వేషధారణ, డోలు మ్రోగింపులతో జాతర మరింత శోభాయమానంగా మారింది.

కొండలరావు శాంతాదేవి సాయి ఆధ్వర్యంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ప్రసాద పంపిణీ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమ్మక్క–సారలమ్మల జాతరతో గరీబ్‌పేట గ్రామం భక్తి, శక్తి, సంస్కృతి పరిమళాలతో కళకళలాడింది.