Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 7:13 am Posted by : parivarthanaawaaz

అమరవీరుల త్యాగమే నేటి శాంతి సౌభ్రాతృత్వానికి పునాది — కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ

అమరవీరుల త్యాగమే నేటి శాంతి సౌభ్రాతృత్వానికి పునాది — కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ,

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర  వీర కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు త్యాగాల వల్లే నేటి సమాజంలో శాంతి, భద్రత కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

పరివర్తన అవాజ్,   కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, ఐఏఎస్  మరియు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. శాంతి, సౌభ్రాతృత్వం నేడు కనిపించడం అమరవీరుల త్యాగ ఫలమని జిల్లా కలెక్టర్  పేర్కొన్నారు. పోలీసులు ప్రజల రక్షణ, భద్రత, శాంతి స్థాపన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో విధి నిర్వాహణలో ప్రాణత్యాగం చేసిన ఏడుగురు పోలీసు సిబ్బందికి ఆయన గౌరవప్రదంగా నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, వారి సంక్షేమానికి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర   మాట్లాడుతూ — “పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమైనవి. వారు చూపిన స్ఫూర్తి ప్రతి పోలీసు అధికారికి మార్గదర్శకం. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ కర్తవ్యనిష్ఠతో సేవలందిస్తున్నారు” అని అన్నారు. 1959 అక్టోబర్ 21న లడక్‌లోని అక్సాయ్ చిన్ వద్ద చైనా దళాల దాడిలో వీరమరణం పొందిన సిఆర్పిఎఫ్ జవాన్ల స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అసాంఘిక శక్తులతో పోరాటంలో 191 మంది పోలీసులు వీరమరణం పొందగా, తెలంగాణ రాష్ట్రం నుండి ఐదుగురు పోలీసు సిబ్బంది — అసిస్టెంట్ కమాండెంట్ బానోత్ జవహర్‌లాల్, కానిస్టేబుళ్లు టి. సందీప్, వడ్ల శ్రీధర్, యం. పవన్ కళ్యాణ్, బి. సైదులు — అమరులయ్యారని ఎస్పీ  తెలిపారు. వీరి త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాల సంక్షేమం కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

పోలీస్ అమరవీరుల స్మరణార్థం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 31 వరకు రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, వ్యాసరచన, ఫోటో మరియు వీడియో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ  ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపీఎస్, సిఐలు నరహరి, రామన్, సంతోష్ కుమార్, ఆర్ఐలు నవీన్ కుమార్, సంతోష్ కుమార్, కృష్ణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.