ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోజాతీయ విద్యా దినోత్సవము
శేరిలింగంపల్లి.పరివర్తన అవాజ్ నవంబర్ 11,జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోగల గచ్చిబౌలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర భారతావని తొలి విద్యాశాఖామాత్యులు, భారతరత్న అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని రిహానా బేగం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డిపార్టుమెంటుకు చెందిన ఆచార్య తాళ్ళ సుమాలిని విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో గుణాత్మక విద్యకు మార్గదర్శి మరియు విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. ఆజాద్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. స్వాతంత్రోద్యమంలో పది సంవత్సరముల కారాగార శిక్షను అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆజాద్ పండితుడు, కవి, సంపాదకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని అన్నారు. ఆయన బహుభాషా కోవిదుడు (అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ). ఆయన స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వములో 11 సంవత్సరముల పాటు విద్యా శాఖామాత్యులుగా కొనసాగి విద్యా సంస్కరణలకు విశేష కృషి చేశారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యలో ప్రగతి సాధించాలని భావించి 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు అలాగే 1952 వ సంవత్సరములో సెకండరీ విద్యకోసం ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. విద్యా శాఖమాత్యులుగా పనిచేసిన తొలి అయిదేళ్ళ కాలంలోనే యూజీసీ, ఐసిసిఆర్ ,ఏఐసీటీయు,సీఐఎన్ఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఖరగ్ పూర్ లో తొలి ఐఐటీ ఏర్పాటు చేశారు. వీటితో పాటు సంగీత, సాహిత్య, లలితకళల సర్వతోముఖాభివృద్ధికి అకాడమీలను నెలకొల్పారు. స్వయం ప్రతిపత్తి సంస్థలైన భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, ఆరట్స్ అకాడమీలను స్థాపించారు. చిన్నపిల్లలకు 6 సంవత్సరముల నుండి 14 సంవత్సరముల వరకు ఉచిత నిర్బంధవిద్య ఉండాలని, అలానే ముఖ్యంగా బాలికలు విధిగా పాఠశాలలకు వెళ్ళాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. ఆయన హిందూ ముస్లింల ఐక్యతకు కూడా కృషి చేశారు. ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న తో గౌరవించి ఆయన జన్మదినమైన నవంబరు 11ను 2008వ సంవత్సరము నుండి జాతీయ విద్యా దినోత్సవముగా ప్రకటించి అమలుచేయడం జరుగుతుంది. విద్య వలన జ్ఞానము, ధైర్యము, సంస్కారముల వంటి సుగుణములు అలవడటంతో పాటు ఆరోగ్యం, జీవనోపాధి, సామాజిక స్థిరత్వం పెరగడం, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి కలగటం, పేదరికం నుండి బయటపడటం, సమాజ శ్రేయస్సు, దేశాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడం, మంచి ఆలోచనా విధానాన్ని పెంపొందించుకునేందుకు, మెరుగైన నిర్ణయాలను తీసుకోవడం వంటి అనేక ప్రయోజనాలు విద్య వలన కలుగుతాయి”* అని అన్నారు. నేటి విద్యా విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా అంతర్జాలం అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. విద్యా విధానంలో వస్తున్న నూతన సాంకేతికతను ఆకళింపు చేసుకొని ప్రపంచస్థాయి విద్యార్థులతో ధీటుగా మన విద్యార్థులు కూడా రాణించాలంటే కృషి, పట్టుదల, ఏకాగ్రతలతో పాటు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందిపుచ్చుకోవాలి. నేటి విద్యార్థులు అంతర్జాలానికి ఆకర్షితులై వారి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అవసరమైనంత వరకే అంతర్జాలాన్ని ఉపయోగించుకోవాలి అని సూచించారు.చెడు అలవాట్లకు (ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం) దూరంగా ఉండాలి. పౌష్టికాహారం తీసుకుంటూ నిత్య వ్యాయామం, ధ్యానం ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. నిత్యము పుస్తక పఠనం చేయాలి. చక్కని చేతి వ్రాత కలిగి ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న అవకాశాలను అంది పుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశాభివృద్ధికి పాటు పడటంతో పాటు సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయడమే మనము ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసరు, అధ్యాపకులు రాములు, హన్మంతు, మోహన్, మహేష్ గౌడ్, జగదీష్, విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



