ప్రభుత్వ భూమిలో ఎస్ జి స్నాక్స్ కంపెనీ నిర్మాణం!
ఏడాదిగా నిద్రమత్తులో రెవెన్యూ అధికారులు
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న పంచాయతీ కార్యదర్శి
మెదక్ జిల్లా ప్రతినిది డిసెంబర్ 6 (పరివర్తన అవాజ్), పేదలు పూరి గుడిసె వేసుకోవడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఒక గుంట భూమి ఇవ్వమంటే ఇవ్వడానికి నిరాకరిస్తున్న ప్రభుత్వాలు, స్థానిక అధికారులు.. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని మాత్రం వ్యాపారులకు కట్టబెడుతున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట మండలం, కామారం పంచాయతీ పరిధిలో జరిగిన భూ కబ్జా వ్యవహారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. కామారం పంచాయతీ పరిధిలో గల 166 సర్వే నెంబర్లో ఉన్న సుమారు 0.39.5 గుంటల ప్రభుత్వ భూమిని ఎస్.జి. స్నాక్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రికార్డులలో ఉన్న పొరపాట్లను అదునుగా తీసుకుని, కంపెనీ యాజమాన్యం ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని, దానిలో యథేచ్ఛగా నిర్మాణాలను చేపడుతోంది.
ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని, దీనిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కామారం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్ మొదటి నుండి పోరాడుతున్నారు. ఈ విషయమై ఆయన పంచాయతీ స్థాయి నుండి జిల్లా ఉన్నతాధికారుల వరకు ఏడాది కాలంగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు మాజీ సర్పంచ్ ఫిర్యాదు చేసినా, కంపెనీ అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నా… సంబంధిత అధికారులు మాత్రం ఈ విషయంలో పూర్తిగా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. ఏడాది కాలంగా సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న కంపెనీ యాజమాన్యం, కనీసం గ్రామ పంచాయతీ అనుమతులు కూడా తీసుకోకుండా కంపెనీ నిర్మాణాలను వేగవంతం చేసింది. రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోగ కంపెనీ యాజమాన్యానికి వత్తతుపలుకుతున్నారని
పేదలకు గుంట భూమి కూడా దొరకని ఈ రోజుల్లో, ఇంత విలువైన ప్రభుత్వ భూమిని వ్యాపారులకు కట్టబెట్టడం అన్యాయం,” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి, కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకుని, గ్రామానికి ఉపయోగపడే విధంగా ఆ భూమిని వినియోగించాల నివారు డిమాండ్ చేస్తు న్నారు.
ఈ విషయంపై కామారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సుహాసినిని వివరణ కోరగా, ఆమె స్పందించారు. “అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న విషయమై కంపెనీకి ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేశాము. మరోసారి నోటీసులు ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకుంటాము,” అని ఆమె తెలిపారు. అయితే, కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.




