పాల్వంచలో పెరిగిన అక్రమ ఇసుక రవాణా – ఉదాసీనంగా అధికారులు, స్థానికుల్లో భయాందోళన
పాల్వంచ టౌన్ పరివర్తన ఆవాజ్ నవంబర్ 01 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్, సరిహద్దు ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ముర్రేడు వాగు నుంచి పగలూ రాత్రి తేడా లేకుండా దర్జాగా జరుగుతున్న ఈ ఇసుక దందా వెనుక రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల ఉదాసీనత అనేక అనుమానాలను, తీవ్ర ఆరోపణలను రేకెత్తిస్తోంది.అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు చిన్న రోడ్లలో సైతం అతి వేగంగా నడుపుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు డ్రైవర్లు సెల్ఫోన్ల ను చెవి వద్ద పెట్టు కుని తమ యజమానులకు అప్డేట్లు ఇస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుండటం మరింత ప్రమాదకరం.చాలామంది డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ట్రాక్టర్లకు కనీసం చెల్లుబాటు అయ్యే పత్రాలు (కాగితాలు) లేకపోవడం నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టం చేస్తోంది.దమ్మపేట సెంటర్ నుంచి శ్రీనివాస్ కాలనీ వెళ్లే రోడ్లు, ఒడ్డు గూడెం ప్రధాన రహదారుల్లో ఇప్పటికే పెద్ద పెద్ద గుంతలు పడి అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ దొంగ రవాణా చేసే ట్రాక్టర్లు వేగం గా నడపడం వల్ల రోడ్లు మరింతగా దెబ్బతింటున్నాయి. అత్యంత వేగం గా వెళ్లే ఈ ట్రాక్టర్ల వలన ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అక్రమం గా ఇసుక తరలిపోతున్నా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధి కారులు పట్టించుకోకపోవడం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఉదాసీనతపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు ఈ ఇసుక రవాణా దందాకు సహకరిస్తున్నారని, అందుకే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికుల నుంచి బలంగా ఆరోపణలు వస్తున్నాయి.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

