నాలా ఆక్రమణపై నిమ్మకు నీరెత్తిన అధికారులు
శ్రీ చైతన్య కళాశాల బరితెగింపు వెనుక ‘మతలబు’ ఏమిటి?
శేరిలింగంపల్లి, పరివర్తన అవాజ్ నవంబర్ 23 శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదినగూడ ప్రాంతంలో ఐదు ప్రధాన చెరువులను కలిపే అత్యంత కీలకమైన గొలుసుకట్టు నాలా ఆక్రమణ పెను సంచలనం సృష్టిస్తోంది. స్థానిక శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే, పట్టపగలు ఈ జీవనాలా రూపురేఖలు మార్చివేసి, దారి మళ్లించి, శాశ్వత బాక్స్ డ్రైన్‌ను నిర్మించినా, అడ్డుకోవాల్సిన ప్రభుత్వ మూడు శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారూ అంతే కాకుండా నాలా కబ్జాపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు నవంబర్ 14, 2025న తనిఖీ నిర్వహించి, శ్రీ చైతన్య యాజమాన్యం నాలాను ఆక్రమించి, మట్టి వ్యర్థాలతో పూడ్చివేసినట్లు ధృవీకరించారు. దీనిపై ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నవంబర్ 15న తక్షణ చర్యల కోసం జీహెచ్ఎంసీ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ మరియు శేరిలింగంపల్లి మండల తహసీల్దార్‌కు అధికారిక లేఖలు అందజేశారు.లేఖలో ఆక్రమణలపై సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మండల తహసిల్దార్ ని కోరడం జరిగిందని నాలాలో వ్యర్థాలు వేయడాన్ని నిలిపివేసి, అక్రమ నిర్మాణాలను తొలగించడానికి సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ కు లేఖ రాసిన ఇరిగేషన్ అధికారులు ఈ ఆదేశాలన్నీ లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పనిసరని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు.
కబ్జా పై అధికారుల పాత్ర కొట్టొచ్చినట్లు ఉంది !
కొన్ని సంవత్సరాలుగా క్రీడా మైదానం కోసం పనులు మొదలుపెట్టిన యాజమాన్యం, నాలాను లోలోపల కబ్జా చేసి, దాని దారి మార్చి, బాక్స్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసిన విషయం స్థానిక అధికారులకు తెలియకుండా ఉందా అని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.ఐదు చెరువుల అనుసంధాన మార్గాన్ని దారి మళ్లించి, పూడ్చివేసి, బాక్స్ డ్రైన్ నిర్మించాలంటే… స్థానిక అధికారుల సహకారం మరియు పాత్ర లేకుండా సాధ్యపడే పని కాదు, అని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇంతటి భారీ అక్రమ నిర్మాణం పట్టపగలు జరుగుతున్నా, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక అధికారుల అండదండలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు.
చర్యల జాప్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు
ఇరిగేషన్ అధికారులు లేఖ అందించి రోజులు గడుస్తున్నా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడంలో ఆలస్యం వహిస్తుండటంపై స్థానికులకు తీవ్ర అనుమానాలు కలుగుతున్నాయి. అధికారులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని, ఈ నాలా ఆక్రమణ వెనుక వారి పాత్ర కూడా ఉందనేందుకే ఈ నిష్క్రియత అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల నాలాను పూర్తిగా పూడ్చివేసిన కాలేజ్ యాజమాన్యం
స్థానికుల డిమాండ్:
అధికారులు ఇకనైనా జాప్యం విడనాడి, లోకాయుక్త ఆదేశాల మేరకు తక్షణమే నాలా ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాలాను పూర్వస్థితికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి వినాశనానికి కారకులైన కబ్జాదారులపై, వారికి వంత పాడిన అధికారులపై కేసులు నమోదు చేయాలని వారు కోరుతున్నారు.





