దివ్యాంగుల క్రీడోత్సవ విజేతలకు బహుమతుల ప్రదానం
మెదక్ పరివర్తన అవాజ్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల భాగంగా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడోత్సవాలలో విజేతలైన క్రీడాకారులకు బుధవారం స్థానిక స్టేడియంలో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి డి ఆర్ డి ఏ APD సరస్వతి, డిపిఎం వెంకటేశ్వరరావు , మెప్మా పిడి హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా APD సరస్వతి మాట్లాడుతూ, “పునరావాస కేంద్రంలో 283 మంది పేర్లు నమోదయ్యినా, ప్రస్తుతం 40 మంది మాత్రమే క్రమం తప్పకుండా వస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న ఫిజియోథెరపీ వల్ల పలువురు పిల్లలు నడవగలుగుతున్నారు. నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నాం” అని తెలిపారు. దివ్యాంగులు పునరావాస కేంద్రాలను వినియోగించుకుని భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని ఆమె సూచించారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించే సామర్థ్యం ఉన్నందున నిస్సహాయతకు లోనవ్వకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా సంఘాలలో సభ్యులై వడ్డీ లేని రుణాలను పొంది స్వయం ఉపాధి కార్యకలాపాలు, చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణానికి చెందిన దివ్యాంగ యువతి వైష్ణవి “మూగ చవుడు ” నృత్యం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. దివ్యాంగ సంఘాల నాయకులను శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ, మెదక్ CDPO వెంకట రామమ్మ , భరోసా కేంద్రం న్యాయవాది శ్వేత , DLSA నాగరాజు , దివ్యాంగ సంఘాల ప్రతినిధులు , డిడబ్ల్యుఓ సిబ్బంది , డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు పాల్గొని సేవలు అందించారు.

