జీపీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 10 మహబూబాబాద్. బయ్యారం. గ్రామ పంచాయితీ సిబ్బందికి ఉద్యోగ భద్రతతో పాటు హక్కుల పరిరక్షణకై నిరంతరం పోరాడుతున్న తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు ఈనెల 24,25 తేదీల్లో జిల్లాలోని గార్ల మండల కేంద్రంలో జరుగనున్నాయని, మహాసభలను జయప్రదం చేయాలని సిఐటీయూ జిల్లా కార్యదర్శి, గ్రామ పంచాయితీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కుంట ఉపేందర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని వేజేళ్ళ సైదులురావు భవనంలో గ్రామ పంచాయితీ యూనియన్ మండల కమిటీ సమావేశం వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు మల్టి పర్పస్ వర్కర్ విధానంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, నైపుణ్యం లేని పనులు చేయడం వల్ల అనేకమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఆదివారం, పండుగ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీ కార్మికులు వేతనాలు సకాలంలో అందక అవస్థలు పడుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయితీ కార్మికులకు కనీస వేతనం 26 వేలతో పాటు వర్కర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర మహాసభల్లో చర్చించి తగిన కార్యాచరణ రూపోందిస్తామని, మహాసభల జయప్రదానికి గ్రామ పంచాయితీ సిబ్బందితో పాటు ఉద్యమ శ్రేయోభిలాషులు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి వల్లాల వెంకన్న గ్రామ పంచాయితీ యూనియన్ మండల నాయకులు అశోక్, ఆదిశేషులు, సర్వర్ పాషా, రమేష్, వెంకన్న, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
