పరివర్తన ఆవాజ్ హైదరాబాద్, అక్టోబర్ 9:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రూప్-1 పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గన్‌పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో
పాల్గొన్న ఆమె, గ్రూప్-1 నియామకాల్లో జరిగిన అక్రమాలను తీవ్రంగా తప్పుబట్టారు.
కవిత మాట్లాడుతూ, “గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమే. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ నియామకాలను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలి” అని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఆమె, “ఇది నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయలేదు. పాత నియామకాలను చూపించి గొప్పలు చెప్పుకుంటోంది. ఇది న్యాయం కాదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నాలో జాగృతి కార్యకర్తలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రూప్-1లో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
