ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ
తప్పుడు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములను కాజేసిన రంగారెడ్డి జిల్లా ఏడీ!
రంగారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ డిసెంబర్ 05 . రంగారెడ్డి జిల్లా లో ప్రభుత్వ భూముల పత్రాలతో అక్రమాలకు పాల్పడి, ఏకంగా రూ. 100 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టిన ఓ ప్రభుత్వ అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఎట్టకేలకు వల పన్ని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఏడీ శ్రీనివాసులు తన పదవిని దుర్వినియోగం చేస్తూ, తప్పుడు సర్వే నెంబర్లను సృష్టించడం ద్వారా విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అక్రమాల ద్వారానే ఆయన దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను దండుకున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.ఈ కేసులో శ్రీనివాసులుకు సంబంధించిన మై హోమ్ భూజ నివాసంతో పాటు, ఆయన బినామీలు, స్నేహితుల నివాసాలలో, అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.ఏసీబీ అధికారుల సోదాల్లో కొత్తమ్ శ్రీనివాసులు భారీగా కూడబెట్టిన ఆస్తుల చిట్టా బయటపడింది. ఆయన పేరు మీద, బినామీల పేర్ల మీద ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటి వివరాలు
* మై హోమ్ భూజ (హైదరాబాద్ )విలాసవంతమైన, ఖరీదైన ఫ్లాట్.
* నారాయణపేట : ఒక భారీ రైస్ మిల్.
* అనంతపురం : 11 ఎకరాల వ్యవసాయ భూమి.
* కర్ణాటక : మరో 11 ఎకరాల వ్యవసాయ భూమి.
* మహబూబ్నగర్ జిల్లా : నాలుగు విలువైన ప్లాట్లు.
* నారాయణపేటలో : నాలుగు అదనపు ప్లాట్ల తో పాటు శ్రీనివాసులు నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో భారీ మొత్తంలో 1.6 కిలోల బంగారం 770 గ్రాముల వెండి 5 లక్షల నగదు, విలువైన వస్తువులు లభ్యమయ్యాయి: ఈ విలువైన వస్తువులను, ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతం లో సస్పెన్షన్ గురైన పద్ధతి మార్చుకోని అధికారి కొత్తమ్ శ్రీనివాసులు మీద గతంలో కూడా ఏసీబీ కేసు నమోదైనట్లు, ఆ కారణంగా ఆయన కొంతకాలం సస్పెన్షన్లో కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే, సస్పెన్షన్ తర్వాత తిరిగి విధుల్లో చేరినప్పటికీ, ఆయన తన అక్రమ పద్ధతిని మార్చుకోలేదని, మరింత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన కీలకమైన విభాగంలో పనిచేస్తూ, ప్రజల ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టి అక్రమాస్తులు పోగేసిన ఈ ‘అవినీతి తిమింగలం’పై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అక్రమాలకు పాల్పడిన ఘటనలో శ్రీనివాసులుతో పాటు అతనికి సహకరించిన ఇతర ఉద్యోగులు, బినామీల పాత్రపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలిపారు

