ఇల్లందు మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు, నవంబర్ 23 (పరివర్తన అవాజ్):తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా, సామాజికంగా ప్రోత్సహించే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఇందిరా మహిళా శక్తి’ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ఇల్లందు నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఇల్లందు తాహశీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎంపీడీవో ధన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై మహిళా సోదరీమణులకు ఉచిత చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి అధికారి (డిడిఓ) విద్యా చందన ని ఎమ్మెల్యే కనకయ్య గారు ప్రత్యేకంగా సత్కరించారు. జిల్లా అభివృద్ధిలో ఆమె చూపిన కృషికి గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు ఆమెను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మహిళల ఆశీర్వాదమే ప్రధాన కారణమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారని, అందులో భాగంగానే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో మహిళలకు అగ్రస్థానం కల్పిస్తున్నారని వివరించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, అలాగే రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి ఆరు గ్యారెంటీ పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాల్లో భాగంగానే, మహిళలందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి పేరిట ఈ చీరలను పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రజా ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు , మండల రాంమహేష్, కాశయ్య, సమ్మక్క, రామకృష్ణ, శారద, యదలపల్లి అనసూర్య, పులి సైదులు, పూనెం సురేందర్, తాటి భిక్షం, అరెం కిరణ్, ఎట్టి హరికృష్ణ, మడుగు సాంబమూర్తి, చిల్లా శ్రీనివాస్, ప్రసన్న కుమార్ యాదవ్, కల్తీ పద్మ, పాయం లలిత, పాయం స్వాతి, బానోత్ శారద, మోకాళ్ల వెంకటమ్మ, కుంజా వసంతరావు, చంద్రశేఖర్, తారాచంద్ తదితర ముఖ్య నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


