రామారెడ్డి పరివర్తన అవాజ్ : రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలోని గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేయించి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సుమారు మూడేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణం నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. కాలభైరవ స్వామి దేవాలయం, బుగ్గ రామేశ్వర లింగం ఆలయం, భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట దేవాలయాలకు వెళ్లే భక్తులు ఇదే మార్గాన్ని ఉపయోగిస్తారని తెలిపారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని వారు కోరారు. ప్రజలకు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఎల్లారెడ్డి ప్రాంత అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యేను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యపై నిరసన తెలిపినట్లు నాయకులు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, కాలభైరవ స్వామి ఆలయ మాజీ చైర్మన్ సతీష్ గుప్తా, రామారెడ్డి మాజీ సర్పంచ్ పడిగెల శ్రీనివాస్, ఉపసర్పంచ్ పోతునూరి ప్రసాద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జంగం లింగం, మాజీ రైతుబంధు అధ్యక్షుడు తిరుపతి, లాగల మైపాల్, హన్మల రాజయ్య, బల్దేవ్, అంజయ్య, రాజిరెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.