Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 3:02 pm Posted by : KUNDHURU ANAND

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. ఏటికొప్పాకలో పోలీసుల పర్యవేక్షణ

అనకాపల్లి జిల్లా పరివర్తన ఆవాజ్ : ఏటికొప్పాక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏటికొప్పాకలో పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆదివారం జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.పరవాడ సీఐ భాస్కరరావు, ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర పోలీసు సిబ్బందితో కలిసి ఏటికొప్పాకలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, కేంద్రాల పరిసరాలు, భద్రతాపరమైన అంశాలు, రాకపోకల మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది అని, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రజలు సంయమనం పాటించాలని, పోలీసులకు సహకరించి సజావుగా ఎన్నికలు జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పిలుపునిచ్చారు.