Date of Publish : 26 November 2026, 8:08 amPosted by : KUNDHURU ANAND
ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత.. 8 మండలాల్లో భారీ భద్రత
అనకాపల్లి జిల్లా పరివర్తన అవాజ్ : అనకాపల్లి, నవంబర్ 25: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. గురువారం 8 మండలాల్లో జరగనున్న పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించి, ఎన్నికల ప్రక్రియపై నిరంతర నిఘా ఏర్పాటు చేసింది.
పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రం వద్ద జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులపై ప్రత్యేక సూచనలు చేశారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.శాంతిభద్రతల పరిరక్షణకు రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, వీడియో గ్రఫీతో పాటు డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 బీఎన్‌ఎస్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లు, భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పడాలని కోరారు.
ఈ సమావేశంలో పరవాడ డీఎస్పీ బి. మోహనరావు, సీఐలు భాస్కరరావు, చంద్రశేఖర్, ధనుంజయరావు, ఇతర పోలీసు అధికారులు, ఎస్సైలు, బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు.