Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 5:18 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

–ఉర్సు కరీమాబాద్‌లో ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కొండ సురేఖ,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 26

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.శనివారం వరంగల్ నగరంలోని ఉర్సు కరీమాబాద్‌లో గాదే స్వర్ణలత (భర్త అన్వేష్), వేల్పుగొండ రేణుక (భర్త కాసిమ్) కుటుంబాలకు మంజూరైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నివాసాలు మాత్రమే కాదని, పేద కుటుంబాలకు ఆత్మగౌరవానికి ప్రతీకలని అన్నారు. కొత్త ఇళ్లలో స్వర్ణలత, రేణుక కుటుంబాలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారులకు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త ఇళ్లు లబ్ధిదారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్యే కొండా సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద నూతన గృహాల ప్రవేశ ద్వారం వద్ద రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్, వరంగల్ నగర కమిషనర్, డిప్యూటీ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.