Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 8:07 am Posted by : parivarthanaawaaz

దోమకొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ల మంజూరు..

పరివర్తన అవాజ్ కామారెడ్డి జిల్లా దోమకొండ అక్టోబర్ 17: కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ సదుపాయాలను కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన చోట్ల విద్యుత్ మీటర్లు, కనెక్షన్లు అందజేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.దోమకొండ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, లబ్ధిదారులకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా మండల పరిధిలోని అంచనూర్, సీతారాంపల్లి, అంబారీపేట, కోనాపూర్, ముత్యంపేట్, చింతామణిపల్లి, లింగుపల్లి, గొట్టిముక్కుల తదితర గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, మీటర్లు, విద్యుత్ కనెక్షన్లు అందజేశారు.దోమకొండ సబ్‌స్టేషన్ ఏఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది సమన్వయంతో పనులను వేగవంతంగా చేపట్టారు. లైన్‌మెన్లు శంకర్, సదానందం, నవీన్, వేణు తదితరులు క్షేత్రస్థాయిలో శ్రమించి విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కనెక్షన్ల పనులను విజయవంతంగా పూర్తి చేశారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో విద్యుత్ శాఖ సిబ్బంది చొరవ చూపడంతో ఆయా గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరింది. ప్రభుత్వ పథకం ద్వారా నిర్మించుకున్న ఇళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల్లో భాగంగా విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.