-రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
-యాసంగి పంటకు ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేయాలి
–కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
(పరివర్తన అవాజ్) కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 17: రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రైతులు విద్యుత్ కోతల సమస్యను ఎదుర్కొంటున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేఎల్పీ ఉపనేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ కోతలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ ఎస్ఈ సాల్య నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్, సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరు నెలల ముందే తెలిసినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో చూపుతున్న శ్రద్ధను రైతుల సమస్యల పరిష్కారంపై చూపడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అవసరమైన సాగునీటిని తప్పనిసరిగా అందించాలని ఆయన కోరారు. రాబోయే యాసంగి పంట సాగుకు అవసరమైన విద్యుత్, సాగునీటి సరఫరాపై ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ముందస్తు ప్రణాళికలు లేకపోతే భవిష్యత్తులో సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీర్చడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.రైతులు పంటలు సాగు చేసే కీలక సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, సాగునీటి సమస్యలను పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి, రాబోయే యాసంగి సీజన్‌కు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు