Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 11:37 am Posted by : parivarthanaawaaz

మచారెడ్డి పోలీసుల తీరుపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. కేసు నమోదు

ఫరీద్‌పేట మహిళా వార్డు సభ్యుల ఫిర్యాదుపై ఎస్ హెచ్‌ఆర్‌సీ కొరడా

కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన మానవ హక్కుల కమిషన్ (కేసు నెం. 3947/36/18/2026

కామారెడ్డి జిల్లా  పరివర్తన ఆవాజ్ : కామారెడ్డి జిల్లా, పల్వంచ మండలం ఫరీద్‌పేట గ్రామంలో అక్రమ బెల్టు షాపులను, నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించిన మహిళా వార్డు సభ్యురాలపై దౌర్జన్యం చేసి, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన మచారెడ్డి పోలీసుల వ్యవహారశైలిపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. గ్రామానికి చెందిన 1వ వార్డు సభ్యురాలు తగిరంచ రమాదేవి మరియు తోటి ప్రజాప్రతినిధులపై సర్పంచ్ వర్గానికి చెందిన బట్ట శంకర్ మరియు ఇతరులు దాడికి పాల్పడి, బూతులు తిడుతూ బెదిరింపులకు దిగినా స్థానిక పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని బాధితులు మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC), బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి అధికారికంగా కేసు నమోదు చేసింది (కేసు నెం. 3947/36/18/2026). ప్రజాప్రతినిధుల భద్రతను గాలికొదిలి, నిందితులకు కొమ్ముకాస్తున్న పోలీసుల తీరుపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.