Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 1:30 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

CEC జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి… -ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…

వరంగల్ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక 

వరంగల్ పోచమ్మ మైదాన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీన వరంగల్ పోచంమైదన్ నుండి హన్మకొండ అంబేద్కర్ వరకు అఖిలపక్ష ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని, ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకునే ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి అసలైన ప్రతినిధులని అన్నారు. అలాంటి పవిత్రమైన ఓటు హక్కు విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలు, పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తినా వాటిని ఎన్నికల సంఘం అత్యంత బాధ్యతగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థపైనే ప్రజలకు అనుమానాలు కలిగే పరిస్థితి రావడం బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలు, ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని, రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓటు అనేది ప్రతి భారతీయుడి రాజ్యాంగ హక్కు. ఆ ఓటును కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత. ప్రజల ఓటు హక్కుపై అనుమానాలు కలిగించే పరిస్థితులు ఏర్పడితే వాటిని నివృత్తి చేయాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నీ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు” అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు, నిరసనలు చేపడతామని తెలిపారు. ప్రజల ఓటు హక్కు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాస్, రాష్ట్ర మేరా కార్పొరేషన్ చైర్మన్ వెంకట రాజ్యం,జిల్లా ఎస్సీ సెల్ చైర్మెన్ సిలువేరు శ్రీనివాస్, బీఎస్పీ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ వనం మహేందర్, సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ బాష్మియా, ఎంసిపిఐ జిల్లా సెక్రెటరీ మాలోత్ సాగర్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లీడర్ హకీమ్ నవీద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.