పెద్ద చెరువు వద్ద కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
అధికారుల తీరుపై కామారెడ్డి పట్టణ ప్రజల ఆగ్రహం
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాల్సిన సమయంలో, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో మహిళలు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఉత్సవాలకు తగిన లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో పలువురు సెల్‌ఫోన్ లైట్ల వెలుగులోనే బతుకమ్మ వేడుకలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కనీస సౌకర్యాల కల్పనపై అధికారులు ముందస్తు దృష్టి సారించలేదని విమర్శించారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. “మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. మాకు చెప్పినంతవరకు మేము చేశాం” అంటూ అధికారులు సమాధానం చెప్పినట్లు వారు పేర్కొన్నారు. పండుగల సమయంలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం అధికారుల బాధ్యత అని, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే బతుకమ్మ ఉత్సవాల వద్ద తగిన వెలుతురు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి పెద్ద చెరువు పరిసరాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, భవిష్యత్తులో పండుగల నిర్వహణ సమయంలో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు.