Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 1:56 pm Posted by : parivarthanaawaaz

సద్దుల బతుకమ్మకు దోమకొండలో ఏర్పాట్లు పూర్తి..

                 మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

(పరివర్తన అవాజ్) కామారెడ్డి జిల్లా దోమకొండ అక్టోబర్ 17: కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న సద్దుల బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య తెలిపారు. బతుకమ్మ పండుగకు భారీ సంఖ్యలో మహిళలు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.దోమకొండ కేంద్రంలోని పలుగు గడ్డ, వివేకానంద కాలనీ, శివరాం మందిర్ కాలనీ, సుభాష్ రోడ్ కాలనీ, ముత్యంపేట్ రోడ్డు కాలనీలతో పాటు వివిధ వీధుల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను తీసుకురానున్నారు. ఈ క్రమంలో బురుజు నుంచి చాముండేశ్వరి ఆలయం మీదుగా, పాత బస్టాండ్ నుంచి కుడి చెరువు వరకు బతుకమ్మలను తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శనివారం గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాత బస్టాండ్ నుంచి కుడి చెరువు వరకు రహదారి వెంట ఉన్న చెట్ల పొదలు, ముళ్ల కంపలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. బతుకమ్మలను తీసుకువచ్చే మహిళలు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేలా మార్గాన్ని సిద్ధం చేశారు.సద్దుల బతుకమ్మ వేడుకలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉండటంతో కుడి చెరువు కట్టపై మహిళలు బతుకమ్మలు పేర్చి పూజలు నిర్వహించేందుకు వీలుగా విద్యుత్ దీపాలను కూడా పునరుద్ధరించారు. రాత్రి వేళల్లోనూ మహిళలకు ఇబ్బందులు కలగకుండా వెలుతురు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచ్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు. సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రశాంతంగా, సంతోషంగా నిర్వహించుకునేలా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.