Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 5:02 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

హన్మకొండ ప్రెస్ క్లబ్‌లో సీనియర్ జర్నలిస్టుల సత్కారం – ఉర్దూ జర్నలిజానికి గర్వకారణం…. —లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో 40 ఏళ్ల సేవలకు జర్నలిస్టుల సన్మానం, సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఎం.ఏ. వహీద్ గుల్షన్‌కు మొదటి సత్కారం.

హన్మకొండ పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9 లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ క్లబ్, బస్ స్టాండ్ సమీపంలో, హన్మకొండలో సీనియర్ జర్నలిస్టుల సత్కారానికి ఒక ఘనమైన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం 9 అక్టోబర్ 2026, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జరిగింది, దీనికి డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి MJF అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డైరెక్టర్ I & PR హైదరాబాద్  డి.ఎస్. జగన్, జాయింట్ డైరెక్టర్ శ్రీ కె. వెంకట రమణ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా లయన్ డాక్టర్ కె. చంద్రశేఖర్ ఆర్య PMJF, IPDG వైస్ చైర్మన్ MD320, లయన్ పి. హరికిషన్ రెడ్డి MJF ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, లయన్ రేవూరి రమణా రెడ్డి PMJF సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, పీడీజీ లయన్ ముచ్చా రాజిరెడ్డి, పీడీజీ లయన్ ఎన్. వెంకటేశ్వరరావు మరియు పీడీజీ లయన్ కన్నా పరశురాములు తో పాటు మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా లయన్ పి.వి. మదన్ మోహన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్‌లో 40 సంవత్సరాలకు పైగా జర్నలిజం సేవలు అందిస్తున్న జర్నలిస్టులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మొదటగా సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ *ఎం.ఏ. వహీద్ గుల్షన్* గ వారి 40 ఏళ్ల సుదీర్ఘ జర్నలిజం సేవలకు అభినందిస్తూ సత్కరించారు. ఎం.ఏ. వహీద్ గుల్షన్ గత 40 సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో చురుకుగా ఉన్నారు మరియు దినపత్రిక సియాసత్, దినపత్రిక ఎతెమాద్,  ఉర్దూ జుబాన్ వీక్లీ ఎడిటర్‌గా తమ సేవలను అందిస్తున్నారు. 40 ఏళ్ల సీనియారిటీలో మొదటగా వహీద్ గుల్షన్ కి సత్కారం లభించడం నిజంగా ఉర్దూ జర్నలిజానికి గర్వకారణమైన విషయం. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉర్దూ జర్నలిజం మనుగడ మరియు అభివృద్ధిలో వహీద్ గుల్షన్ వంటి సీనియర్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని లయన్స్ క్లబ్ చేసిన ఈ కృషిని అభినందించారు.