పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 25
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ధర్మ మార్గాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజంలో మానవత్వం, సమానత్వం, సోదరభావం, నైతిక విలువలను పెంపొందించడంలో వాల్మీకి మహర్షి బోధనలు ఎంతో కీలకమని తెలిపారు. మహర్షి వాల్మీకి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ భావితరాలకు మంచి విలువలను అందించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు, వాల్మీకి సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.