Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 2:47 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: కమిషనర్ వెంకన్న.. —నర్చరింగ్‌ నెయిబర్‌హుడ్స్‌–2.0’ సిటీ లెవల్‌ వర్క్‌షాప్‌ నిర్వహణ…

జిడబ్ల్యుఎంసి పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08..చిన్నారులు, తల్లిదండ్రులు, కుటుంబాలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన, పచ్చదనంతో కూడిన ప్రజా ప్రదేశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GWMC), వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (WRI ఇండియా) ఆధ్వర్యంలో ‘నర్చరింగ్‌ నెయిబర్‌హుడ్స్‌–2.0’ సిటీ లెవల్‌ వర్క్‌షాప్‌ను గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న మాట్లాడుతూ.. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేలా, తల్లిదండ్రులు ప్రశాంతంగా సమయం గడిపేలా నగరంలోని ప్రజా ప్రదేశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్కులు కేవలం వినోదానికి పరిమితం కాకుండా చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడే విధంగా రూపుదిద్దుకోవాలని సూచించారు.నగరంలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని పార్కులు, ఆట స్థలాలు, ఆహ్లాదకరమైన ప్రజా ప్రదేశాలుగా మార్చేందుకు మరింత విస్తృతంగా చర్యలు చేపడతామని కమిషనర్‌ తెలిపారు. ఇప్పటికే సుమారు 20 ప్రాంతాల్లో పార్కులు, పైప్‌లైన్‌ తదితర మౌలిక సదుపాయాల పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేస్తామని చెప్పారు.చిన్నారులు, కుటుంబాలకు అనుకూలమైన వాతావరణం కల్పించడంలో భాగంగా 0–5 సంవత్సరాల పిల్లలకు సురక్షితమైన ఆట స్థలాల రూపకల్పన, ప్లేగ్రౌండ్‌ సేఫ్టీ మార్గదర్శకాల అమలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వర్క్‌షాప్‌లో వివరించారు. బాలసముద్రం, క్రిస్టియన్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో పిల్లలకు అనుకూలమైన ఆట స్థలాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల కొనసాగింపునకు శానిటేషన్‌, ఇంజనీరింగ్‌, హార్టికల్చర్‌ తదితర మౌలిక సదుపాయాల విషయంలో జీడబ్ల్యూఎంసీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. భాగస్వామ్య సంస్థలు, వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ గుర్తించిన ప్రతి ప్రాంతాన్ని దశలవారీగా అభివృద్ధి చేసి, ఈ కార్యక్రమాన్ని నగరంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు.వర్క్‌షాప్‌లో 2020–2026 మధ్య ‘నర్చరింగ్‌ నెయిబర్‌హుడ్స్‌–2.0’లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతి, భవిష్యత్‌ కార్యాచరణపై ప్రజెంటేషన్‌ మరియు ప్రదర్శన నిర్వహించారు. నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, వరంగల్‌ను పిల్లలు, కుటుంబాలకు స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ జోనా, WRI ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అరుణిమా సేన్, సీనియర్‌ ప్రోగ్రామ్‌ అసోసియేట్స్‌ శబ్నా సీమాము, సుఫియాన్‌ ఖాజీ, సిహెచ్ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ సమ్మయ్య, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ప్రశాంత్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మహేందర్తో పాటు ఇంజనీరింగ్‌, హార్టికల్చర్‌, మెప్మా, ఐసీడీఎస్‌ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.