Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 5:58 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

-బాధిత యువతికి ఈగ మల్లేశం సంఘీభావం…

వర్ధన్నపేట  అక్టోబర్ 08, పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక: ప్రేమ పేరుతో మోసపోయానని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన బాధిత యువతికి కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం సంఘీభావం తెలిపారు.వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ గత మూడేళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ప్రస్తుతం వివాహానికి నిరాకరిస్తున్నారని బాధిత యువతి ఆరోపిస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లేశం తెలిపారు. ఆమెకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు.బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చకుండా, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. అధికారం, అంగబలం ఉన్నవారు కూడా చట్టానికి అతీతులు కారని, ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలను మోసం చేయడం తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో బాధితులకు సమాజం, ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని కోరారు.స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ విషయంలో తక్షణమే స్పందించి, పెద్దన్న పాత్ర పోషిస్తూ బాధిత యువతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈగ మల్లేశం కోరారు.రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కాకూడదని, ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మానవత్వంతో స్పందించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం శాంతిభద్రతలు, నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే ప్రాంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.