వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హాసన్‌పర్తి మండల కేంద్రంతో పాటు గుంటూరుపల్లి, వంగపహాడ్,56 వ డివిజన్ గోపాలపూర్ ,55వ డివిజన్ భీమారం, గుండ్లసింగారంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ప్రకృతిని పూజిస్తూ, పూలను ఆరాధిస్తూ మహిళలు జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని అన్నారు.గ్రామాల్లో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పాటలు పాడుతూ, కోలాటాలతో సందడి చేశారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.