పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6
రంగలీల మైదానం, ఉర్సు గుట్ట, కరీమాబాద్, ఉర్సు ప్రాంతంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలు, రావణ వధ కార్యక్రమం మరియు సద్దుల బతుకమ్మ పండగ ఏర్పాట్లపై మాజీ మంత్రి వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.దసరా, సద్దుల బతుకమ్మ పండగలకు పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కొండా సురేఖ సూచించారు.సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, మరుగుదొడ్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కూడా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.అలాగే రావణ వధ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ తీగలు, తాత్కాలిక కనెక్షన్లు, లైటింగ్ వ్యవస్థలను ముందుగానే పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు.ఉత్సవ ప్రాంగణంలో నిరంతర తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వైద్య సదుపాయాలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, అత్యవసర మార్గాలు ముందుగానే గుర్తించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజల భద్రతే మొదటి ప్రాధాన్యతగా అధికారులు పనిచేయాలని, ఏ చిన్న లోపం కూడా పండగ సమయంలో ప్రజలకు ఇబ్బందిగా మారకుండా ముందుగానే గుర్తించి పరిష్కరించాలని కొండా సురేఖ స్పష్టం చేశారు. కార్యక్రమాల నిర్వహణ పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.సద్దుల బతుకమ్మను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారని, మహిళలు, చిన్నారులు, వృద్ధులు సురక్షితంగా పండగలో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అధికారుల బాధ్యత అని కొండా సురేఖ అన్నారు.దసరా, సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ప్రజలందరూ ఆనందంగా, ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా ఎటువంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద , పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత , మున్సిపల్ కమిషనర్ టి. వెంకన్న ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ , ఉత్సవ కమిటీ సభ్యులు, నాగపురి సంజయ్ ,ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..