పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, అక్టోబర్ 27
అర్నబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. భారత వాతావరణ శాఖ (IMD) నివేదికల ఆధారంగా వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం సంబంధిత జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై దిశానిర్దేశం చేశారు.జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.తహసీల్దార్లు తమ పరిధిలోని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
—లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా…
జిల్లాలోని ప్రమాదకర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ సంబధిత శాఖల అధికారులను ఆదేశించారు.వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించేలా సహాయక, పునరావాస ఏర్పాట్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
––సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలి….
జిల్లా అగ్నిమాపక అధికారి, మామునూరులోని నాలుగో బెటాలియన్ ఎస్‌డీఆర్ఎఫ్ కమాండెంట్ తమ బృందాలను, అవసరమైన పరికరాలను తక్షణ సహాయక చర్యలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే పరికరాలు, వాహనాలు, సిబ్బంది, ఇతర విపత్తు నిర్వహణ వనరులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో సమాచార మార్పిడిని కొనసాగిస్తూ, అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు.
–—24 గంటలు కంట్రోల్ రూమ్ సేవలు….
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3424,9154252936 ఫోన్ నెంబర్ ద్వారా 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.ప్రజలు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచించే జాగ్రత్తలను పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కోరారు.