Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 10:45 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

*22-A భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు: డా. కోటూరి మానవతారాయ్..* *22-A భూముల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది – హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి..* *భూదాన్‌, వక్ఫ్‌ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం కఠిన చర్యలు తప్పవు..* *ఆక్రమణల వెనుక ఎంతటి రాజకీయ నాయకుల ఉన్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం..* *జర్నలిస్టుల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సమస్యను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో సమన్వయం చేస్తాం – వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు అయూబ్..*

 

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక ; సెప్టెంబర్ 19  22-A నిషేధిత జాబితాలోని భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి, వరంగల్ & హనుమకొండ సమన్వయకర్త డా. కోటూరి మానవతారాయ్ అన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు.. మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు  ఇనగాల వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు…

ఈ సందర్భంగా కోటూరి మానవతారాయ్  మాట్లాడుతూ…..*

కోట్లాది ఎకరాల ప్రజల భూములను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 22-A నిషేధిత జాబితాలో చేర్చిందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు విషప్రచారం చేస్తున్నారని, కానీ 22-A సమస్య కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. ఈ సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచే ఉందని, గత బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కూడా 22-A నిషేధిత జాబితా కొనసాగిందని తెలిపారు.ప్రభుత్వ నిషేధిత జాబితాలో మొత్తం 1,02,00,000 ఎకరాలు ఉన్నాయని, అందులో 3,73,000 ఎకరాలు ప్రైవేటు భూములు ఉన్నాయని, మిగిలిన భూముల్లో నిబంధనల ప్రకారం శాశ్వతంగా నిషేధిత జాబితాలో ఉండే భూములు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ధరణి పోర్టల్‌లో పొరపాటున 22-A జాబితాలో చేరిన ప్రైవేటు భూములను సరిచేసేందుకు గతంలోనే సీసీఎల్‌ఏ నుంచి 03-11-2022న CMR No.3691/2022 సర్క్యులర్‌ జారీ అయిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 22-A జాబితాలో మార్పులు చేయాల్సి వచ్చిన సమయంలో కొన్ని ప్రాంతాల్లో పాత జాబితా తిరిగి నమోదవడంతో సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు.స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి భూమి కూడా పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన విషయమే దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు. సమస్యను గుర్తించిన వెంటనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పొరపాట్లను సరిచేస్తామని ప్రకటించారని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించగా మొత్తం 980 ఫిర్యాదులు అందాయని చెప్పారు.పొరపాటున 22-A జాబితాలో చేరిన అర్హులైన ప్రైవేటు భూముల సమస్యలను పరిష్కరించి, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేస్తున్నామని ఆయన తెలిపారు. అందువల్ల 22-A సమస్యను కోట్లాది మంది ప్రజల సమస్యగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు సరికాదన్నారు.అధికారంలో ఉన్న సమయంలో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూముల విషయంలో జరిగిన వ్యవహారాలపై కూడా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డా. మానవతారాయ్ డిమాండ్ చేశారు. 2004 వరకు ఎకరం భూమి కూడా లేని కేసీఆర్ కుటుంబ సభ్యులకు 2026 నాటికి 9 జిల్లాలు, 24 మండలాలు, 31 గ్రామాల్లో 439.30 ఎకరాల భూములు ఎలా వచ్చాయో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.అలాగే కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు 46 ఎకరాల భూమి ఎలా వచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్‌ నేతల భూముల వ్యవహారాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించిన తర్వాత, రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకు ముఖ్యమంత్రికి 175 ఎకరాల భూములు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఫామ్‌హౌస్‌ పరిధిలో కలుపుకున్నట్లు ఆరోపణలు ఎదురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటిని అర్హులైన దళితులకు అందించాలనే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.22-A భూముల విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించి, అర్హులైన ప్రైవేటు భూ యజమానులకు న్యాయం చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని డా. కోటూరి మానవతారాయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భూ రికార్డుల సమస్యల పరిష్కారానికి భూ భారతి ద్వారా “Grievance relating to inclusion in Prohibited Properties List” అనే సేవను అందుబాటులో ఉంచింది అన్నారు…

*ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అయూబ్  మాట్లాడుతూ…*

22-A భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. 22-A సమస్య గత ప్రభుత్వాల కాలం నుంచే ఉందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రైవేటు భూ యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు.వరంగల్‌ తూర్పు నియోజకవర్గం పరిధిలోని భూదాన్‌, వక్ఫ్‌ బోర్డు భూముల ఆక్రమణలపై కూడా ఆయన స్పందించారు. ఈ భూముల ఆక్రమణలకు సంబంధించి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నాయకులు 22-A నిషేధిత భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుని, అక్రమంగా ఆస్తులు కూడబెట్టడంతో పాటు ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు.భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వాస్తవాలను తెలుసుకుని బీఆర్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అయూబ్‌ సూచించారు.జర్నలిస్టుల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్య తన దృష్టిలో ఉందన్నారు. త్వరలోనే వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, జర్నలిస్టుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో సమన్వయం చేస్తామని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని అయూబ్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు….

ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామి రెడ్డి  మాట్లాడుతూ..*

22-A భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపడుతోందని, అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన భూ సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజలకు పారదర్శకమైన భూ పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అపోహలు సృష్టించడం మానుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులకు సూచించారు.ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, ఓబీసీ సెల్ చైర్మన్ ఓర్సు తిరుపతి, మహిళ జిల్లా అధ్యక్షురాలు కర్ణాటీ పార్వతమ్మ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, జిల్లా అధికార ప్రతినిధులు నిమ్మానిశేఖర్ రావు, ఎర్ర యాకూబ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , కమలుద్దీన్, వర్ధన్నపేట టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్, Nsui నాయకులు రహమతుల్లా, మహిబూద్ పాషా తో పాటు పలువురు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు….