Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 1:43 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-స్వచ్ఛతలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్…. -50 ప్రగతి సిటీల్లో జీడబ్ల్యూఎంసీకి చోటు…. వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనర్ వెంకన్న,CMHO డాక్టర్ రాజారెడ్డి, MHO డాక్టర్ రాజేష్

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక   జీడబ్ల్యూఎంసీ, సెప్టెంబర్ 29…

స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) ఆధ్వర్యంలో మంగళవారం న్యూ ఢీల్లీ నుండీ నిర్వహించిన వికసిత్ భారత్ @2047 – స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పలు నూతన కార్యక్రమాలు, మార్గదర్శకాలను ఆవిష్కరించారు.ముఖ్యంగా SWM Rules–2026కు అనుగుణంగా నాలుగు రకాల వ్యర్థాలను మూలస్థాయిలోనే వేర్వేరుగా సేకరించే 4-వే సోర్స్ సెగ్రిగేషన్ విధానం, అలాగే ప్రజలు పారిశుద్ధ్య సమస్యలు, ఫిర్యాదులను సులభంగా తెలియజేసి పరిష్కారం పొందేందుకు వాట్సాప్ ఆధారిత ప్రజా ఫిర్యాదుల వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర మంత్రి విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పారిశుద్ధ్య నిర్వహణలో వేగం, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే వీటి ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు.దేశవ్యాప్తంగా 50 నగరాలను ‘ప్రగతి సిటీస్’గా ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి హైదరాబాద్‌తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అవకాశం లభించింది. ఈ నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, మూలస్థాయి వ్యర్థాల వేర్పాటు, శాస్త్రీయ వ్యర్థాల ప్రాసెసింగ్, ప్రజల భాగస్వామ్యం, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారు.ప్రగతి సిటీలకు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించి, దశలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. నగరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న GWMC క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. కేంద్రం ఆవిష్కరించిన నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా వరంగల్ నగరానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో CMHO డాక్టర్ రాజారెడ్డి, MHO డాక్టర్ రాజేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.