పరివర్తన అవాజ్. తెలుగు దిన పత్రిక హన్మకొండ సెప్టెంబర్ 29:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలకు షాదీఖానా నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా 0.25 గుంటల స్థల కేటాయింపు పత్రాన్ని మత పెద్దలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు. మంగళవారం మైనార్టీ మత పెద్దలు, పెద్దల సమక్షంలో కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో షాదీఖానా నిర్మాణం కోసం ఒక స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఆ స్థల పరిస్థితులు, భవిష్యత్తులో నిర్మాణానికి ఎదురయ్యే ఇబ్బందులను అధికారులు పరిశీలించారని తెలిపారు. గతంలో ఆ ప్రాంతంలో భద్రకాళి అమ్మవారి మట్టి తీసుకువచ్చి స్థలాన్ని పూడ్చడం జరిగిందని, అక్కడ నిర్మాణం చేపడితే భవనం పునాదులు కుంగిపోయే అవకాశం ఉందన్న సాంకేతిక అంశాలను అధికారులు గుర్తించారని వివరించారు.మైనార్టీలకు మంచి వసతులతో షాదీఖానా నిర్మించాలన్న ఉద్దేశంతోనే పాత స్థలానికి ప్రత్యామ్నాయంగా మరింత అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు రాజకీయంగా విమర్శిస్తూ, గతంలో కేటాయించిన స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించకుండా రాజకీయ లబ్ధి కోసం మైనార్టీలను తప్పుదోవ పట్టించడం సరికాదని పేర్కొన్నారు.ఇప్పటికే మత పెద్దలు, స్థానిక పెద్దలతో కలిసి స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, రహదారి సౌకర్యం, స్థల పరిస్థితులు, భవిష్యత్ నిర్మాణానికి అనుకూలత వంటి అంశాలను వారికి స్వయంగా వివరించామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని మత పెద్దలకే కల్పించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.మైనార్టీల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తోందని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. షాదీఖానా నిర్మాణంతో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. అవసరమైన తదుపరి చర్యలను అధికారులతో సమన్వయం చేసుకుని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాజీపేట దర్గా పీఠాధిపతి కుసురు పాషా,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ అజిత్ ఉల్లా,మాజీ కార్పొరేటర్లు అబూబకర్,నసీం జాన్,విజయశ్రీ రాజాలీ,నాయకులు అంకుస్,బాబాయ్,ముజాహిద్,సమీ,మైనార్టీ మత పెద్దలు, స్థానిక నాయకులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.