పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక
వరంగల్, సెప్టెంబర్ 18:
వెదురు పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విలువైన సహజ వనరుగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.వెదురు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించనైనది.వెదురు ప్రకృతికి మిత్రుడు, ప్రజలకు ఉపాధి, భవిష్యత్తుకు భరోసానిచ్చే పునరుత్పాదక సహజ వనరుల్లో ఒకటని పేర్కొన్నారు.తక్కువ సమయంలో వేగంగా పెరిగే స్వభావం, అనేక రకాలుగా వినియోగించుకునే అవకాశం కారణంగా పర్యావరణ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వెదురుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.
**పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర:*
వెదురు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించడంలో సహాయపడటంతో పాటు పచ్చదనాన్ని పెంచుతుందని కలెక్టర్ తెలిపారు.వెదురు వేర్ల వ్యవస్థ నేలను బలంగా పట్టి ఉంచడం ద్వారా నేల కోతను తగ్గించడంలో సహాయపడుతుందని, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతకు తోడ్పడుతుందని వివరించారు.
వాతావరణ మార్పుల నివారణకు దోహదం:
వెదురు వేగంగా పెరగడం వల్ల తక్కువ సమయంలో అధిక జీవపదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. వెదురు ఆధారిత ఉత్పత్తులను దీర్ఘకాలం వినియోగించడం ద్వారా కార్బన్‌ను ఉత్పత్తుల్లో నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందని, తద్వారా స్థిరమైన, పర్యావరణహిత అభివృద్ధికి వెదురు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్లాస్టిక్‌కు పర్యావరణహిత ప్రత్యామ్నాయం:
బుట్టలు, చాపలు, కప్పులు, ప్లేట్లు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు తదితర అనేక ఉత్పత్తులను వెదురుతో తయారు చేయవచ్చన్నారు.అవసరమైన చోట్ల ప్లాస్టిక్‌కు బదులుగా వెదురు ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు.ఇంటి మరియు నిర్మాణ రంగాల్లో వెదురుతో ఫర్నిచర్, కుర్చీలు, టేబుళ్లు, తెరలు, చాపలు, గృహ అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చన్నారు. ఆధునిక సాంకేతికతతో బాంబూ బోర్డులు, ప్యానెల్స్‌తో పాటు వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారవుతున్నాయని తెలిపారు. స్కిన్‌కేర్, హెయిర్‌కేర్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లోనూ వెదురు ఆధారిత పదార్థాల వినియోగం పెరుగుతోందన్నారు.
ఉపాధి, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి అవకాశం:
వెదురుతో హస్తకళలు, ఫర్నిచర్, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, ఇతర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా కళాకారులు, చేతివృత్తిదారులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కలెక్టర్ అన్నారు. అనుకూలమైన నేల, వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో వెదురు సాగును ప్రత్యామ్నాయ వ్యవసాయ కార్యకలాపంగా చేపట్టవచ్చని తెలిపారు.వేగంగా పెరుగుదల, పునరుత్పాదక స్వభావం కారణంగా వెదురు స్థిరమైన అభివృద్ధికి ముఖ్యమైన సహజ వనరుగా నిలుస్తోందన్నారు.వెదురు ఒక మొక్క మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థికాభివృద్ధి, స్థిరమైన భవిష్యత్తుకు విలువైన సహజ వనరుగా గుర్తించాలని కలెక్టర్ సూచించారు.
“వెదురును పెంచుదాం – పచ్చదనాన్ని పెంచుదాం..
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం..
చేతివృత్తులకు ప్రోత్సాహం కల్పిద్దాం..
గ్రామీణ ఉపాధిని బలోపేతం చేద్దాం..
స్థిరమైన భవిష్యత్తును నిర్మిద్దాం” అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి పుష్పలత ,జడ్పి సీఈఓ వసంత జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బాలాజీ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.