పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ సెప్టెంబర్ 26:
జిల్లాలో వీబీజీ–రామ్జీ (VB–G RAM G), వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక, ఎల్నినో ప్రభావం నివారణ ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించి, సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో గ్రామ పంచాయతీ ప్రణాళిక రూపకల్పన, ఇందిరమ్మ ఇండ్లు, రూఫ్ రీప్లేస్మెంట్, నీటి సంరక్షణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2026 అక్టోబర్ నుంచి 2027 జూన్ వరకు గ్రామ పంచాయతీల వారీగా అవసరాలను గుర్తించి, ప్రజల ప్రాధాన్యతలకు అనుగుణంగా సమగ్ర గ్రామ పంచాయతీ ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. గ్రామాల అవసరాలు, మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఉపాధి, వ్యవసాయం, నీటి సంరక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.ఎల్నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన ముందస్తు నివారణ చర్యలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంటి కుంటల నిర్మాణానికి ప్రాధాన్యత….
నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే ఇంటి కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల వారీగా అవసరాలను గుర్తించి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.
–శాఖల సమన్వయంతో నిధుల సద్వినియోగం….
ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రామ పంచాయతీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల ద్వారా అందుబాటులో ఉన్న నిధులను సమగ్ర ప్రణాళికతో వినియోగించి, నిధుల దుర్వినియోగానికి తావులేకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలని స్పష్టం చేశారు.
—ఇందిరమ్మ ఇండ్లలో అర్హులకు ప్రాధాన్యత….
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పున, అందులో 500 ఇండ్లను రూఫ్ రీప్లేస్మెంట్కు, 1,500 ఇండ్లను గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు ప్రాధాన్యతా క్రమంలో మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.అదేవిధంగా సొంత ఇల్లు లేని అర్హులైన కుటుంబాలను గుర్తించి, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో వారికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించి, నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,డిఆర్డిఓ నాగపద్మజా,జడ్పీ సీఈవో వసంత,మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, హౌసింగ్ పి డి విష్ణు వర్ధన్ రెడ్డి, డిపివో కల్పన సంబంధిత శాఖల అధికారులు పాల్గొని గ్రామ పంచాయతీ ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, నీటి సంరక్షణ, ఎల్నినో ప్రభావం నివారణ చర్యలు, నిధుల వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.