పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 జిడబ్ల్యూఎంసి
ప్రజల నుంచి స్వీకరించే ప్రతి ఫిర్యాదును బాధ్యతతో పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు.సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి 92 దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత విభాగాలకు బదలాయించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అనవసర జాప్యాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.అనంతరం గత వారం ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల విభాగాల వారీగా పరిష్కార స్థితిగతులను కమిషనర్ సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు, చేపట్టిన చర్యలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.పౌరులకు అందించే ప్రతి సేవలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం దరఖాస్తులుగా కాకుండా, వాటి వెనుక ఉన్న సమస్యకు పరిష్కారం అందించే బాధ్యతగా అధికారులు భావించాలని సూచించారు.
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు
-టౌన్ ప్లానింగ్: 36
-ఇంజినీరింగ్: 34
-ఆరోగ్యం, పారిశుద్ధ్యం: 09
-రెవెన్యూ: 11
-నీటి సరఫరా:02
-మొత్తం: 92…ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.