Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:51 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–గడ్డి మందుపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పోరాటానికి ఫలితం… –కేంద్ర వ్యవసాయ శాఖకు ఎంపీ డా. కడియం కావ్య కృతజ్ఞతలు..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28  హనుమకొండ

రైతులు, గ్రామీణ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన పారాక్వాట్ డైక్లోరైడ్‌ (గడ్డి మందు)పై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్‌సభ వేదికగా చేసిన పోరాటానికి కీలక ఫలితం లభించింది. పారాక్వాట్ డైక్లోరైడ్ వినియోగంపై ప్రమాదాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మార్చి 27న లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆ తర్వాత పరిణామాల్లో తెలంగాణ శాసనసభ కేంద్రాన్ని సంపూర్ణ నిషేధం విధించాలని కోరుతూ తీర్మానం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ విక్రయం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించింది.తాజాగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 22న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పారాక్వాట్ డైక్లోరైడ్‌కు కొత్తగా రిజిస్ట్రేషన్ ఇవ్వడాన్ని నిషేధించింది. ఇప్పటికే కీటకనాశక చట్టం-1968లోని సెక్షన్ 9 కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కమిటీ ఆ సర్టిఫికెట్లను వెనక్కి తీసుకోవాలని, వాటిని తిరిగి ఇవ్వని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.పారాక్వాట్‌ ప్రమాదాలపై గతంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులు, వైద్యులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన ఫలితం లేకుండా పోయింది.

–లోక్‌సభలో ప్రాణాంతక గడ్డి మందుపై వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య గళం..

ఈ పరిస్థితుల్లో వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య గడ్డి మందు నిషేధం అంశాన్ని రాష్ట్రానికి పరిమితం చేయకుండా పార్లమెంట్‌ వేదికగా జాతీయ సమస్యగా మార్చారు. పారాక్వాట్ డైక్లోరైడ్ కేవలం కలుపు నివారణ మందు కాదని.. మానవ ఆరోగ్యం, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య లోక్‌సభలో వివరించారు. దీని వినియోగం వల్ల నేల, నీరు కలుషితమవుతున్నాయని, వ్యవసాయ క్షేత్రాల్లో దీని ప్రభావం భూసారంపై పడే ప్రమాదం ఉందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలకు ఈ రసాయనం సాధనంగా మారుతోందని ఎంపీ డా.కడియం కావ్య సభ దృష్టికి తీసుకెళ్లారు. పారాక్వాట్ విషప్రయోగానికి నిర్దిష్ట విరుగుడు అందుబాటులో లేకపోవడం, తీవ్రమైన విషతుల్యత కారణంగా ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని పలు మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. వైద్య వర్గాలు, ఐఎంఏ తదితర సంస్థలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు.కేంద్ర స్థాయిలో పారాక్వాట్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ కావ్య డిమాండ్ చేసిన అనంతరం తెలంగాణలోనూ ఈ అంశంపై చర్చ మరింత తీవ్రతరమైంది. తెలంగాణ శాసనసభ మార్చి 30న పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్రం సంపూర్ణ నిషేధం విధించాలని కోరుతూ తీర్మానం చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 60 రోజులపాటు పారాక్వాట్ విక్రయం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగంపై నిషేధం విధించింది.

–-కేంద్రం తుది నిర్ణయం..

ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం జూలై 10న పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, రవాణా, పంపిణీ, విక్రయం, వినియోగాన్ని నిషేధించే ఉద్దేశంతో ముసాయిదా ఉత్తర్వును జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరింది. నిపుణుల కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ సిఫార్సులను పరిశీలించిన అనంతరం సెప్టెంబర్ 22న తుది ఉత్తర్వును జారీ చేసింది.కేంద్రం తాజా ఉత్తర్వులో పారాక్వాట్ డైక్లోరైడ్ రిజిస్ట్రేషన్‌పై నిషేధం విధించడంతోపాటు, ఇప్పటికే మంజూరైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. మానవులు, జంతువులకు ప్రమాదం కలిగించే పరిస్థితి ఉన్నందున తక్షణ చర్య అవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

—ఎంపీ డా.కడియం కావ్య హర్షం..

పారాక్వాట్ డైక్లోరైడ్‌పై లోక్‌సభలో తాను లేవనెత్తిన అంశం కేంద్రం దృష్టిని ఆకర్షించి, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ప్రజల ప్రాణాల రక్షణ దిశగా ముందడుగు కావడంపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ ఈ సందర్భంగా ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రమాదకరమైన రసాయనాల వినియోగం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రజలు నష్టపోకుండా సురక్షితమైన, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. పారాక్వాట్‌ దుష్ప్రభావాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచడంతోపాటు, నిషేధ ఉత్తర్వుల అమలును పకడ్బందీగా పర్యవేక్షించాలని సందర్భంగా వరంగల్ ఎంపీ టట్టు కడియం కావ్య కోరారు.