పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 27
హనుమకొండ: కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను హనుమకొండ జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కూరపాటి వెంకట నారాయణ, సంగం వెంకట్రాజం పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేషన్ చైర్మన్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాన్ని ప్రజల కోసం, ముఖ్యంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అంకితం చేసిన మహనీయుడని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్న బాపూజీ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన మార్గంలో నడుస్తూ వెనకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన సేవలు, త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.